
భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు రావడం సహజమే. కానీ ప్రతిరోజూ గొడవ పడటం మంచిది కాదు. ఇలాంటప్పుడు ఇద్దరూ ఒకరికొకరు మాట్లాడుకోవడం మానేస్తారు. ఇంట్లో ఇద్దరూ ఒంటరిగా గడిపే సమయం పెరుగుతుంది. గొడవల్లో ఉన్నప్పుడు ఆ సమస్యను అలాగే వదిలేయకుండా దాని పరిష్కారం కోసం మాట్లాడటం చాలా అవసరం. కోపంగా ఉన్నప్పుడు, ఇద్దరిలో ఎవరో ఒకరు ఓపికగా అవతలి వారి మాటలు వినాలి అర్థం చేసుకొని సమస్యను తేలికపరచాలి. కొంతసేపు కోపం తగ్గాక ఇద్దరూ కలిసి కూర్చుని ప్రశాంతంగా సమస్యను చర్చించాలి. తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగాలి.
ఇంట్లో తరచూ గొడవపడి కోపంగా ఉంటే కొంత సేపు బయటకు వెళ్లడం మంచిది. ప్రదేశం మారడంతో మనసు కుదుటపడుతుంది.
ప్రశాంతమైన చోట కూర్చుని మాట్లాడితే సమస్యలు తేలికగా పరిష్కరించుకోవచ్చు. భాగస్వామి మీతో మాట్లాడుతున్నప్పుడు మొబైల్ ఫోన్, టీవీ చూసేటట్టు కాకుండా పూర్తి శ్రద్ధతో వినాలి. భార్యాభర్తల మధ్య ఉండే సంభాషణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. మొబైల్ ఫోన్ పక్కన పెట్టి ముఖాముఖి మాట్లాడడం మంచి సంస్కారం. ఇది సంబంధాన్ని బలోపేతం చేస్తుంది.
ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ పని చేసే పరిస్థితి ఎక్కువే. పని తర్వాత ఇంటిపనులు కూడా ఎక్కువగా భార్య బాధ్యతగా ఉంటే మానసికంగా ఆమె అలసిపోతుంది. భర్త సహాయం చేయకపోతే ఆమె ఒత్తిడిలో పడవచ్చు. కొన్నిసార్లు ఇంటిపనుల్లో సహాయం చేయడం వల్ల భార్యకు భర్త తన పట్ల శ్రద్ధ చూపుతున్నాడనే భావన కలుగుతుంది. ఇది చిన్న చర్య అయినా సంబంధాలకు మంచి మార్గం. ఇలాంటి సహాయం భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.
మీ భాగస్వామి ఏదైనా పంచుకుంటే మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఆ మాటలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మీరు పని లేదా ఆలోచనలో బిజీగా ఉన్నప్పటికీ వారిని వదలకుండా వినడం అవసరం. ఇలా చేయకపోతే వారు ఒంటరితనం అనుభవించి మానసికంగా బాధపడతారు. సంబంధం బలంగా ఉండాలంటే మీ జీవిత భాగస్వామి మాటలకూ, భావనలకూ గౌరవం ఇవ్వాలి.
భార్య గృహిణి అయినా ఆమె రోజంతా పని చేస్తుంది. ఇంటిపని సులభం కాదు. అందువల్ల ఆమె చేసే కృషిని గుర్తించి ప్రశంసలు చెప్పడం చాలా ముఖ్యం. భర్త, భార్య చేసే పనుల పట్ల ఆసక్తి చూపించడం, వారిని ప్రోత్సహించడం ప్రేమను పెంచుతుంది. ఇది చిన్న విషయాలు కానీ వాటి ప్రభావం గొప్పదే.
పైన చెప్పిన ఈ విషయాలు జాగ్రత్తగా పాటిస్తే భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. ఈ చిన్న పనులు మీ కుటుంబ జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా మార్చగలవు.