. < 1 minute

మణిపూర్‎లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. ఐదు జిల్లాల్లో ఇంటర్ నెట్ సేవల బంద్

Caption of Image.

ఇంఫాల్: గతేడాది జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్‏లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. మైతేయి నేత అరంబాయి టెంగోల్ అరెస్టుతో తాజాగా మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. అరంబాయి టెంగోల్‎ను విడుదల చేయాలంటూ ఆ వర్గం ప్రజలు శనివారం (జూన్ 7) రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు టైర్లు, ఫర్నిచర్, పలు వాహనాలను తగలబెట్టారు. తులిహాల్‌లోని ఇంఫాల్ ఎయిర్ పోర్ట్ ప్రవేశ ద్వారం వద్ద ఆందోళన చేశారు.

 తమ నాయకుడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భద్రతా దళాలతో ఘర్షణకు దిగారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‎లో కొందరు ఆందోళనకారులు పెట్రోల్ మీద పోసుకుని ఆత్మాహుతికి ప్రయత్నించారు. శనివారం రాత్రి మొదలైన ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. దీంతో కేంద్ర సాయుధ బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.  ఆందోళనకారులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాయి. 

కొన్నిచోట్ల బలగాల లాఠీ ఛార్జ్ చేశాయి. ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించారు. మణిపూర్ రాజ్ భవన్‌కు వెళ్లే రోడ్ల వెంట భద్రతను పెంచారు. నిరసనలు ఉధృతంగా ఉన్న బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, తౌబాల్, కాక్చింగ్ లోయ జిల్లాల్లో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడకుండా నిషేధాజ్ఞలు విధించారు. ఈ జిల్లాలో ఆన్‌లైన్‌లో హింసను ప్రేరేపించే చర్యలు గుర్తించిన పోలీసులు ఐదు రోజుల పాటు ఇంటర్ నెట్ సేవలు నిలిపివేశారు. 

కాగా, 2023 నుంచి మణిపూర్‎లోని కుకీ, మైతేయి వర్గాల మధ్య జాతి హింస చెలరేగుతోన్న విషయం తెలిసిందే. ఇరువర్గాల మధ్య చెలరేగిన అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారడంతో అప్పటి నుంచి మణిపూర్‎లో భద్రతా దళాలను మోహరించారు. ఇదిలా ఉంటే.. ఆదివారం (జూన్ 8) ఇంఫాల్ విమానాశ్రయంలో మైతేయి నేత అరంబై టెంగోల్‎ని సీబీఐ అరెస్టు చేసింది.

 అతడు 2023లో మణిపూర్ హింసకు సంబంధించిన వివిధ నేర కార్యకలాపాలకు పాల్పడ్డాడు. దీంతో నిందితుడిని ఇంఫాల్ నుంచి మణిపూర్ హింస కేసులు విచారణలో ఉన్న గౌహతికి తరలించి న్యాయస్థానంలో హాజరు పర్చారు. ఈ క్రమంలోనే అరంబై టెంగోల్‎ని విడుదల చేయాలని, అతడిని ఇతర ప్రాంతానికి తరలించవద్దని మైతేయి వర్గం నేతలు ఆందోళనకు దిగడంతో మణిపూర్‎లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.