
కళ నుంచి కళాకారుడిని ఎవరూ దూరం చేయలేరు. ఒక రంగంలో అడుగుపెట్టాలి అని గట్టి సంకల్పంతో ఉన్నప్పుడు ఏ పరిస్థితులూ తనని ఆపలేవు. తాను కోరుకున్న జీవితం పొందే అవకాశం దొరకడం అరుదుగా జరుగుతుంది. అలాంటప్పుడు అలర్ట్‌గా ఉండి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నవాడు అంచెలంచెలుగా ఎదుగుతాడు. ప్రస్తుతం ఈ యాక్టర్ కూడా అదే బాటలో ఉన్నాడు. అతనే అర్జున్ రాధాకృష్ణన్. మొదట చెప్పినట్టు ముందుగా తను సినిమా రంగంలోకి రావాలని విదేశాల్లో చేస్తున్న జాబ్ ఉన్నఫళంగా మానేశాడు.
కానీ నటనలో ఓనమాలు కూడా తెలియకపోవడంతో యాక్టింగ్ నేర్చుకోవాలి అనుకున్నాడు. అలా సాగుతోన్న జర్నీలో వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటూ మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2లో పోలీస్ ఆఫీసర్‌గా నటించి ప్రశంసలు అందుకుంటున్నాడు అర్జున్. తన జర్నీలోని కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇవి.
అర్జున్ రాధాకృష్ణన్ తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో పుట్టాడు. కానీ, తను పెరిగిందంతా పుణెలో. తండ్రి సుకుమార రాధాకృష్ణన్, తల్లి లత. అర్జున్‌కి చాలా భాషలు వచ్చు. తల్లి తమిళనాడుకు చెందినవారు కావడంతో తమిళం అబ్బింది. తండ్రిది మలయాళీ ఫ్యామిలీ, అందువల్ల ఈ రెండు భాషలు అనర్గళంగా మాట్లాడతాడు. ఇకపోతే పుట్టి పెరిగిందంతా పుణె, ముంబైల్లో కాబట్టి మరాఠీ, హిందీ నేర్చుకున్నాడు. చివరిగా ఇంగ్లీష్ అది తప్పనిసరి. అర్జున్‌కి నటనే కాదు.. ఫొటోగ్రఫీ కూడా చాలా ఇష్టం.
జాబ్ మానేసి..
అర్జున్, పుణెలోని సెయింట్ మేరీస్ స్కూల్లో చదివాడు. తర్వాత ఇంజినీరింగ్‌లో ఫెయిల్ కావడంతో కొన్నాళ్లు కాల్ సెంటర్లో జాబ్ చేశాడు. ఆ తర్వాత ఫెర్గ్యూసన్ కాలేజీలో చేరి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 2009లో మల్టీ నేషనల్ కంపెనీలో కన్సల్టెంట్‌గా వర్క్ చేశాడు. అయితే అర్జున్‌కి చిన్నప్పటి నుంచి సినిమాలంటే విపరీతమైన ఇష్టం. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, మమ్ముట్టి తన ఫేవరెట్ యాక్టర్స్ అని చెప్తుంటాడు. సినిమాల మీద ఉన్న ఆసక్తి తనని జాబ్‌లో నిలకడగా ఉండనివ్వలేదు. దాంతో 2012లో యాక్టింగ్ నేర్చుకోవడం కోసం జాబ్ కూడా మానేశాడు. ఆ తర్వాత ఏమయిందంటే.. యాక్టింగ్ నేర్చుకోవాలి అనుకున్నాడు.అయితే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది.
అది పాస్ అయితేనే సీటు దొరుకుతుంది. దీంతో పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు. కానీ ఆ పరీక్షలో తాను పాస్ కాలేదు. మళ్లీ పరీక్ష రాశాడు. ఈసారి కూడా ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. ఆ నిరాశలో ఉన్నప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లోని స్టాఫ్‌లో ఒకరు ఎగ్జామ్ ఫెయిల్ అయినా, అతనులో నటించే సత్తా ఉందని గుర్తించారు. ఆ విషయం కాస్ట్యూమ్ డైరెక్టర్ చెవిన పడడంతో ఆడిషన్‌కి రమ్మని పిలుపొచ్చింది. అలా వచ్చిన అవకాశం తనని మళ్లీ వెనుదిరగనివ్వలేదు. రెండుసార్లు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయిన అదే ఇన్స్టిట్యూట్లో ఎన్నో సినిమాలకు అర్జున్ పనిచేశాడు. ఈ క్రమంలో నటించడానికి ముందు ఐలాండ్, రిప్పల్స్, ఆర్ఫన్స్ వంటి థియేట్రికల్ ప్రొడక్షన్స్‌లో ఎన్నోసార్లు పాలుపంచుకున్నాడు.
అబ్దుల్ కలాం పాత్రలో
ఇటు మలయాళంలో వచ్చే ఆఫర్లు అందుకుంటూ అటు హిందీలోనూ తన కెరీర్ కొనసాగించాడు. 2023లో ‘రాకెట్ బాయ్స్’ సిరీస్‌లో అబ్దుల్ కలాం పాత్రలో నటించాడు. ఆ సిరీస్ తనకు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా అర్జున్, అబ్దుల్ కలాంను గుర్తుచేసుకున్నాడు. ‘‘ఆయన ప్రెసిడెంట్‌గా ఉన్న టైంలో తను చదివిన ఫెర్గ్యూసన్ కాలేజీ విజిట్‌కి వచ్చారు. అప్పుడు స్టూడెంట్‌గా గుంపులో ఒకడిగా నిలబడి ఆయన్ను చూసి ఆనందించాను. అలాంటిది ఆయన పాత్రలో నేను నటించడం అనేది ఊహకు కూడా అందని విషయం. అది నిజమైనందుకు అలాంటి గొప్ప అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది”అని చెప్పుకొచ్చాడు.
కెరీర్ మొదలైంది
2017లో ‘శ్రీలాన్సర్’ సినిమా ద్వారా డెబ్యూగా చేశాడు. ఇది హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది. అదే ఏట ‘షట్ అప్’ అనే షార్మ్ ఫిల్మ్‌లోనూ కనిపించాడు. ఆ తర్వాత రూప్కి రాణి, తు, డాన్ సాంగ్, క్యాట్డాగ్ వంటి షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. 2018లో ‘మెగాలోపోలీస్’ అనే హిందీ సినిమాలో ఆడమ్ అనే పాత్రలో నటించాడు. 2022లో తనకు ఇష్టమైన నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఝండ్’ అనే సినిమాలో ‘అర్జున్’ అనే పాత్ర పోషించాడు. అదే సంవత్సరం మలయాళం సినిమాలో ఆఫర్ రావడంతో అక్కడ తన లక్‌ని టెస్ట్ చేసుకున్నాడు. మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన ‘డియర్ ఫ్రెండ్’లో శ్యామ్ పాత్రలో కనిపించాడు.
అంతలోనే టైటిల్ రోల్ చేసేందుకు మరొక అవకాశం తలుపుతట్టింది. దీంతో భాషాభేదం లేకుండా కొత్త హీరోగా తనను తాను ‘పడ’ సినిమాతో హీరోగా మలయాళం ప్రేక్షకులకు పరిచయం చేసుకున్నాడు. ‘పడ’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేశాడు. ఆ సినిమా ఆడిషన్ కోసం వెళ్తే అక్కడ నేను మాట్లాడే మలయాళం యాస చూసి నన్ను సెలక్ట్ చేశాడు. ఎందుకంటే ఆయన ఊహించినదానికంటే నేను కాస్త బెటర్‌గా మలయాళం మాట్లాడానట. ఆ తర్వాత ఈ సినిమా ఓకే అవ్వడంతో నాతోపాటు మా ఫ్యామిలీ కూడా చాలా ఎగ్జైట్ అయింది. మలయాళంలో ఒక ఫుల్ లెంగ్త్ ఉన్న పాత్ర చేస్తున్నందుకు హ్యాపీగా ఫీలయ్యారు.
ఈ కథ చెప్పేటప్పుడు నేను వాస్తవ సంఘటనలను ఆధారం చేసుకుని రాసుకున్నారు అనుకున్నాను. కానీ, షూటింగ్‌కి కేరళ వచ్చిన తర్వాతే తెలిసింది ఎంతో మంది మలయాళీలు దీనిని ఎదుర్కొన్నారు. ఇందులోని పాత్ర కూడా రియల్ క్యారెక్టరే అని తెలుసుకున్నా. అన్నింటికీ మించి నేను మలయాళం సినిమాలో నటించడానికి పదేళ్లకు పైగా వెయిట్ చేస్తున్నా. అలాంటి టైంలో మలయాళం నుంచి ఆఫర్ రావడంతోనే నేను ఇది చేస్తాను అని ఫిక్స్ అయిపోయా. ఇంకా ఎన్నో సినిమాలు మలయాళంలో చేయాలనుంది. ఇంతకుముందే డియర్ ఫ్రెండ్లో నటించడంతో నాకు అవుట్ సైడర్‌ని అనే ఫీలింగ్ పోయింది. ఇప్పుడు కంఫర్టబుల్‌గా సినిమాలు చేయగలుగుతున్నా.