. 3 minutes

Startup India : వేస్ట్ క్లాత్ తో అందమైన బొమ్మలు.. కూతురి కోసం వచ్చిన ఆలోచనే ఇప్పుడు పెద్ద వ్యాపారం

Caption of Image.

ఓ తల్లి తన కూతురు కోసం ఇంట్లో ఉన్న వేస్ట్‌‌ క్లాత్‌‌తో అందమైన బొమ్మ తయారుచేసి ఇచ్చింది.

ఆ బొమ్మ కూతురికి చాలా నచ్చింది. దాంతో అలాంటి ఎకో ఫ్రెండ్లీ బొమ్మలతో చిన్న వ్యాపారం మొదలుపెట్టింది వీణా పీటర్. ఆ వెంచర్ ‘తారాస్ డాల్ హౌస్’ పేరుతో  బెంగళూరులో ఒక ఫేమస్​ బ్రాండ్‌‌గా మారింది. ఇప్పుడు వీణతోపాటు మరికొంతమంది కూడా ఈ ఎకో ఫ్రెండ్లీ బొమ్మల  స్టార్టప్‌‌ ద్వారా ఉపాధి పొందుతున్నారు. 

వీణా పీటర్​ది చెన్నై. కానీ.. కొన్నాళ్ల నుంచి వాళ్ల కుటుంబం బెంగళూరులో ఉంటోంది. చెన్నైలోని ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌‌లో డిగ్రీ, హ్యూమన్​ రీసోర్సెస్‌‌లో మాస్టర్స్ చేసింది వీణ. తర్వాత ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. బ్రిటిష్ ఎయిర్‌‌వేస్, లుఫ్తాన్స, క్యారట్‌‌లేన్ లాంటి పెద్ద కంపెనీల్లో కస్టమర్ సపోర్ట్‌‌ విభాగంలో పనిచేసింది. అలా పదేండ్లు గడిచిన తర్వాత విసుగొచ్చి 2015లో ఉద్యోగం మానేసింది. మళ్లీ ఉద్యోగం చేయాలనే ఆలోచనే రాలేదు. అందుకే తన భర్త పెట్టిన ఒక ఎడ్యుకేషనల్‌‌ స్టార్టప్‌‌కు సాయం చేసేది. 

కూతుర్ని చూసుకోవడమే పని

వీణకు కూతురు తార పుట్టినప్పుడు తన పనులన్నీ వదిలేసి కేవలం కూతుర్ని చూసుకోవడమే పనిగా పెట్టుకుంది. సాధారణంగా ఇప్పటి పిల్లలు చిన్నప్పుడే సోషల్‌‌ మీడియా, గేమ్స్‌‌కి బాగా అలవాటు పడుతున్నారు. కానీ.. వీణ మాత్రం తన కూతుర్ని స్క్రీన్‌‌కి దూరంగా ఉంచేది. కనీసం టీవీ వైపు కూడా చూడనివ్వకుండా పెంచాలి అనుకుంది. అందుకే ఆమె కూడా ఫోన్​ వాడడం మానేసింది. పెరిగేకొద్దీ తారకు బొమ్మల మీద ప్రేమ పెరిగింది. అంతేకాదు.. తారకు తన తల్లి జుట్టుని ముక్కు కింద పెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉంది. 

అందుకే తను లేనప్పుడు తారకు అదే రకమైన ఓదార్పునిచ్చేలా పొడవాటి, మృదువైన జుట్టు ఉన్న బొమ్మను కొని ఇవ్వాలి అనుకుంది వీణ. అలాంటి బొమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టింది. కానీ.. ఆమెకు నిరాశే మిగిలింది. సరైన బొమ్మ ఒక్కటి కూడా దొరకలేదు. ఆమె చూసిన బొమ్మలు చాలావరకు ప్లాస్టిక్‌‌తోనే తయారుచేశారు. అలాంటివి పిల్లలకు అంత సేఫ్​ కాదు. వాటివల్ల పిల్లలకు అనారోగ్య సమస్యలు రావడమే కాదు.. పర్యావరణానికి హాని కలుగుతుంది. క్లాత్‌‌ బొమ్మలు దొరికినా వాటిలో కొన్నింటికి జుట్టు చిన్నగా ఉంది. మరికొన్ని క్వాలిటీగా లేవు. 

వెంట్రుకలు ఈజీగా చిక్కుబడిపోతున్నాయి. అందుకే చివరకు తనే ఒక బొమ్మ తయారుచేయాలని నిర్ణయించుకుంది వీణ. 

వేస్ట్‌ క్లాత్‌తో..

వీణ తన కూతురు కోసం ఇంట్లో ఉన్న వేస్ట్‌ క్లాత్‌, ఉన్ని ఉపయోగించి ఒక బొమ్మ కుట్టింది. ఆ బొమ్మతో తార బాగా ఆడుకునేది. అందుకే అలాంటివే మరికొన్ని తయారుచేసింది. అయితే.. ఒకసారి ఆ బొమ్మలను తన స్నేహితులకు చూపించినప్పుడు వాళ్లంతా ఆమె ఆలోచనకు ఆశ్చర్యపోయారు. చాలామంది  ‘‘ఇలాంటివి మార్కెట్‌‌లో దొరకడంలేదు. మా పిల్లల కోసం ఒకటి తయారుచేసి ఇవ్వు’ అని అడిగారు. అప్పుడే ఆమెకు అలాంటి బొమ్మలకు చాలా డిమాండ్ ఉందని అర్థమైంది. దాంతో వీణ కొన్ని బొమ్మలను తయారుచేసి లోకల్‌‌ స్ట్రీట్‌‌ మార్కెట్‌‌లో అమ్మి, వాటి డిమాండ్‌‌ని పరీక్షించింది.

 ‘‘నేను 30 బొమ్మలను తయారు చేశా. కానీ.. వాటికి ధర ఎలా నిర్ణయించాలో నాకు తెలియలేదు. మార్కెట్‌‌లో కొంత రీసెర్చ్‌‌ చేసి నాకు న్యాయంగా అనిపించిన ధరలు డిసైడ్​ చేశా. వాటిని స్థానికంగా జరిగిన ఒక ఈవెంట్‌‌ ఫ్లీ మార్కెట్‌‌లో అమ్మకానికి పెట్టా. ఒక్కరోజులోనే అన్నీ అమ్ముడయ్యాయి. వాస్తవానికి అది నాకు ఊహించని విజయం. ఆ సక్సెస్‌‌ నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అందుకే ‘తారాస్ డాల్ హౌస్’ పుట్టింది” అంటూ   చెప్పుకొచ్చింది వీణ. వీటన్నింటికీ కారణమైన కూతురు పేరునే తన బ్రాండ్‌‌కి పెట్టింది. 

యూట్యూబ్‌‌లో చూసి..  

వీణ 2023లో వ్యాపారం మొదలుపెట్టింది. క్రాఫ్ట్‌‌ స్కిల్స్‌‌ పెంచుకోవడానికి పింట్రెస్ట్‌‌, యూట్యూబ్‌‌ లాంటివాటిలో కంటెంట్‌‌  చూసింది. తనకు తెలిసిన కొన్ని డిజైన్లు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తే సరిపోదని భావించి కొత్త డిజైన్ల మీద రీసెర్చ్‌‌ చేసింది. ఆ తర్వాత బొమ్మల తయారీలో ఎలాంటి పదార్థాలు, క్లాత్‌‌ మెటీరియల్‌‌ వాడాలో తెలుసుకుంది. రకరకాల ప్రయోగాలు చేసి చివరకు బొమ్మలను రెడీ చేసింది. 

మరికొందరికి ఉపాధి

స్టార్టప్‌‌ పెట్టిన మొదట్లో వీణ ఒంటరిగానే పనిచేసేది. ఈవెంట్లకు ముందు కొన్ని రోజుల పాటు విపరీతంగా కష్టపడేది. కానీ.. డిమాండ్ పెరిగేకొద్దీ తాను చేయలేనని గ్రహించింది. ప్రొడక్షన్‌‌ పెంచాలనే ఉద్దేశంతో మహిళా సంఘాలకు పని అప్పగించింది. కానీ.. క్వాలిటీ తగ్గుతుండడంతో సొంతంగానే తయారుచేయాలని డిసైడ్‌‌ అయ్యింది. దాంతో ముగ్గురు పర్మినెంట్‌‌ మహిళా ఉద్యోగులను, డిజైనర్‌‌‌‌ని నియమించింది. ఒక చిన్న వర్క్‌‌ ప్లేస్‌‌లో వాళ్లకు ట్రైనింగ్‌‌ ఇచ్చింది. ఆ తర్వాత ప్రొడక్షన్​ మొదలుపెట్టింది. అలా వీణ వల్ల మరికొందరు మహిళలు కూడా ఉపాధి పొందుతున్నారు. 

ప్రతి బొమ్మను 

వీణ ప్రతి బొమ్మ తయారీని మొదటి నుంచి చివరివరకు చాలా జాగ్రత్తగా పరిశీలించేది. కానీ.. అందుకు చాలా సమయం పట్టేది. దాంతో డిమాండ్ పెరిగేకొద్దీ ఒక్కో పనిని ఒక్కొక్కరికి అప్పగించింది. అసెంబ్లింగ్ చేసేటప్పుడు మాత్రం వీణ దగ్గరుండి ప్రతి బొమ్మని పరిశీలిస్తుంది. ఒకేసారి దాదాపు 100 బొమ్మలకు కావాల్సిన ఫాబ్రిక్‌‌ని సెలెక్ట్‌‌ చేస్తారు. తర్వాత వాటిని కత్తిరించి, అంచుల వెంట కుట్టి, లోపలికి తిప్పుతారు. ఉతికినా కుంచించుకుపోని కాటన్–పాలిస్టర్ మిశ్రమంతో స్టఫింగ్ చేసి, మళ్లీ కుడతారు. ‘‘స్టఫింగ్​ కోసం 100 శాతం కాటన్‌‌ని ఉపయోగించలేకపోయా. ఎందుకంటే ఉతికిన తర్వాత కాటన్​ ముద్దగా మారుతుంది. ఈ మిశ్రమం మాత్రం బొమ్మలను మృదువుగా మార్చడంతోపాటు చెక్కుచెదరకుండా కాపాడుతుంది’’ అని వివరించింది వీణ. 

ఇదంతా పూర్తయ్యాక కళ్ళు, నోరు లాంటివాటిని ఫాబ్రిక్ మార్కర్‌‌లతో చేతితో గీస్తారు. ఈ బొమ్మలకు స్పెషల్‌‌ ఎట్రాక్షన్‌‌ జుట్టు. దీన్ని మృదువైన, చిక్కులు లేని ఉన్నితో తయారు చేస్తారు. బొమ్మలతో పాటే వాటికి వేయడానికి నైట్ సూట్లు, గౌన్లు, సంప్రదాయ బట్టలు కూడా డిజైన్ చేస్తారు.

 పిల్లలు తమ బొమ్మలను నచ్చిన విధంగా అలంకరించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇలా ప్రస్తుతం వారానికి 200 బొమ్మలు తయారుచేస్తున్నారు. మిగిలిపోయిన బట్ట ముక్కలతో కూడా బొమ్మల పడకలు, దిండ్లు, స్క్రంచీలు లాంటివి తయారుచేస్తున్నారు. బొమ్మలకు మార్చడానికి వీలుండే బట్టలు వేస్తారు. ‘‘మేము బొమ్మలకు బట్టలు కుట్టము. వాటికి బట్టలు వేయడం వల్ల పిల్లలు ఎంతో ఆనందపడతారు. దాంతో వాళ్ల ప్లే టైం పెరుగుతుంది. బొమ్మతో కనెక్ట్ అవ్వడానికి వీలుపడుతుంది” అని చెప్పింది వీణ. 

ప్రాంతాన్ని బట్టి..

ప్రతి బొమ్మతోపాటు రెండు రకాల డ్రెస్సులు ఇస్తారు. ఒకటి మోడ్రన్‌‌, మరొకటి ప్రాంతీయ ఇండియన్‌‌ డిజైన్‌‌లో చేసింది. ఉదాహరణకు.. “ఒక పంజాబీ పిల్లవాడు వస్తే బొమ్మతోపాటు ఘాగ్రా ఇస్తారు. సౌత్‌‌ ఇండియన్ అయితే.. లంగా వోణి లాంటివి ఇస్తారు. అంతేకాదు.. బొమ్మలను ఆర్డర్‌‌‌‌ ఇచ్చేవాళ్లు తమకు నచ్చిన జుట్టు, చర్మం రంగును ఎంచుకోవచ్చు. ప్రస్తుతం వీణ ఆఫ్‌‌లైన్‌‌తోపాటు ఇన్‌‌స్టాగ్రామ్, వాట్సాప్ బిజినెస్‌‌ ద్వారా కూడా ప్రొడక్ట్స్‌‌ని అమ్ముతోంది. ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయి. చిన్న బొమ్మల ధర రూ. 500 నుంచి మొదలవుతుంది.

ఎక్స్‌‌ట్రా బట్టలతో వచ్చే 12-అంగుళాల బొమ్మకు రూ. 1,000.. వార్డ్‌‌రోబ్‌‌లు, పరుపులతో కూడిన డీలక్స్ డాల్‌‌హౌస్ సెట్‌‌కు రూ. 3,500 వరకు ఉంటుంది. ప్రస్తుతం నెలకు 200 బొమ్మలకుపైగా అమ్ముతున్నారు.  రూ. 2 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.