
చెన్నూరు ఎమ్మెల్యే.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వివేక్ వెంకటస్వామి ఇంటి దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. చెన్నూరు, పెద్దపల్లి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వివేక్ వెంకటస్వామికి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఇంటి దగ్గర బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యకర్తలు, నేతలతో కలిసి డాన్స్ చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. మంచిర్యాల ,పెద్దపల్లి, చెన్నూరులో కూడా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. జైపూర్ మండల కేంద్రంలో బాణా సంచాలు కాల్చి సంబురాలు జరుపుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు. మచ్చ లేని నాయకుడు, పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం పని చేసే నాయకుడు వివేక్ వెంకటస్వామి అని ఎమ్మెల్యే సేవలను కొనియాడారు నాయకులు. వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రాకుండా ఎంతో మంది అడ్డుకున్నా ఆయన చేసిన సేవలను గుర్తించి అధిష్టానం మంత్రి పదవి ఇచ్చిందన్నారు.
తెలంగాణ మంత్రివర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ చోటు దక్కించుకున్నారు. జూన్ 8న రాజ్ భవన్ లో మధ్యాహ్నం 12:19 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు . అలాగే డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రు నాయక్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
15 ఏళ్ల పొలిటికల్ జర్నీ తర్వాత తనకు మంత్రి పదవి వచ్చిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకస్వామి. మంత్రి పదవి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తనకు ఫోన్ చేసి చెప్పారన్నారు. ఏ శాఖ ఇచ్చినా న్యాయం చేస్తానని చెప్పారు. తెలంగాణ సాధనలో ఎంతో కీలక పాత్ర పోషించానని చెప్పారు. కాకాస్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానన చెప్పారు. బీఆర్ఎస్ నిరంకుశ పాలనపై ఎంతో పోరాడానన్నారు. ప్రజాపాలనలో అన్ని వర్గాలకు చోటు దక్కుతుందన్నారు వివేక్.