
- ఫైనల్లో సబలెంకపై ఉత్కంఠ విజయం
- కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్ నెగ్గిన గాఫ్
పారిస్: మట్టి కోటకు కొత్త యువరాణి వచ్చింది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అమెరికా స్టార్ కోకో గాఫ్ కొత్త చాంపియన్‌గా అవతరించింది. తనలాగే ఈ మెగా ఈవెంట్‌లో తొలి టైటిల్‌పై కన్నేసిన వరల్డ్ నంబర్ వన్ అరీనా సబలెంకకు చెక్ పెట్టి క్లే కోర్ట్ క్వీన్‌గా నిలిచింది. శనివారం రాత్రి హోరాహోరీగా సాగిన విమెన్స్ సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ గాఫ్ 6–7 (5/7), 6–2, 6–4తో టాప్ సీడ్ బెలారస్ స్టార్ అరీనాపై అద్భుత విజయం సాధించింది. 2023లో యూఎస్ ఓపెన్ ఫైనల్లో సబలెంకను ఓడించి తన మొదటి గ్రాండ్‌స్లామ్ సొంతం చేసుకున్న గాఫ్ ఇప్పుడు రెండో మేజర్ టైటిల్‌ను కూడా ఆమెపైనే గెలిచింది.
2015లో సెరెనా విలియమ్స్ విజయం తర్వాత రోలాండ్ -గారోస్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి అమెరికన్ క్రీడాకారిణిగా గాఫ్ నిలిచింది. మరోవైపు ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మాడిసన్ కీస్ చేతిలో ఓడిన తర్వాత సబలెంకకు ఇది వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఓటమి. తాజా ఫలితంతో సబలెంకతో ముఖాముఖిల్లో 6–5తో గాఫ్ పైచేయి సాధించింది. 2 గంటల 38 నిమిషాల ఈ మ్యాచ్‌లో మూడు ఏస్‌లు కొట్టిన గాఫ్, 9 బ్రేక్ పాయింట్లు నెగ్గి 30 విన్నర్లు కొట్టింది. 8 డబుల్ ఫాల్ట్స్, 30 అనవసర తప్పిదాలు చేసింది. రెండు ఏస్‌లు కొట్టి ఆరు బ్రేక్ పాయింట్లు సాధించిన సబలెంక 37 విన్నర్లు కొట్టినా.. 6 డబుల్ ఫాల్ట్స్‌కు తోడు ఏకంగా 70 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.
హోరాహోరీలో నం.2దే పైచేయి
2013 తర్వాత వరల్డ్ నంబర్ 1, 2 ప్లేయర్ల మధ్య జరిగిన ఈ టైటిల్ ఫైట్ అంచనాలకు తగ్గట్టే హోరాహోరీగా సాగింది. తొలి సెట్‌లోనే ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. లాంగ్ ర్యాలీలు, ఉత్కంఠభరితమైన డ్యూస్ గేమ్‌లతో సాగిన సెట్‌లో ఇద్దరు ప్లేయర్లు ఒకరి సర్వీసును ఒకరు బ్రేక్ చేసుకున్నారు. సబలెంక పవర్‌ఫుల్
బేస్‌లైన్ హిట్టింగ్‌కు, గాఫ్ స్పీడ్, డిఫెన్స్ తోడవ్వడంతో ఇద్దరి ఆట అభిమానులకు కనులవిందు చేసింది. మూడో, ఐదో గేమ్స్‌లో వెంటవెంటనే కోకో సర్వీస్ బ్రేక్ చేసిన సబలెంక 4–1తో ఆధిక్యం సాధించింది. కానీ, గాఫ్ అద్భుతంగా పుంజుకుంది. వెంటవెంటనే రెండు బ్రేక్ పాయింట్లు అందుకొని 4–4తో స్కోరు సమం చేసింది. ఇక్కడి నుంచి ఆట మరింత ఉత్కంఠగా సాగింది.
ఇద్దరు ప్లేయర్లు చెరో గేమ్ నెగ్గడంతో సెట్ టై బ్రేక్‌కు వెళ్లగా ఇందులో సబలెంక పైచేయి సాధించింది. తొలి సెట్ కోల్పోయినా గాఫ్ ఏమాత్రం నిరాశకు గురికాలేదు. రెండో సెట్‌లో తన మార్కు ఆటను చూపెట్టింది. ఈ సెట్‌లో గాఫ్ మూడుసార్లు సబలెంక సర్వీసును బ్రేక్ చేసింది. తన దూకుడైన రిటర్న్‌లు, నిలకడైన బేస్ లైన్ గేమ్‌తో సబలెంకను ముప్పుతిప్పలు పెట్టింది. దాంతో కేవలం 35 నిమిషాల్లోనే సెట్‌ను ముగించి మ్యాచ్‌ను 1–1తో డిసైడర్‌కు తీసుకెళ్లింది. ఇందులో కోకో తొలి పంచ్ ఇచ్చింది. పదునైన ఫుట్‌వర్క్, డీప్ రిటర్న్‌లతో అరీనా సర్వీస్ బ్రేక్ చేసి 2–-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పవర్ ఫుల్ సర్వీస్‌లతో బెలారస్ స్టార్ పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసినా.. మరో బ్రేక్ పాయింట్‌తో అమెరికా ప్లేయర్ 4–-3తో లీడ్‌ను పెంచుకుంది. తర్వాతి గేమ్‌ను అరీనా నిలబెట్టుకున్నా తన సర్వీస్‌లో గాఫ్ టైటిల్ సొంతం చేసుకుంది.