
Trump Mass Layoffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో కొత్త అంశంతో ప్రపంచాన్నే కాకుండా యూఎస్ ప్రజలను సైతం హడలెత్తిస్తున్నారు. వరుసగా వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న ట్రంప్ తాజాగా విద్యారంగంపై కూడా ఫోకస్ పెట్టారు.
యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ పరిపాలనలోని అధికారులు విద్యాశాఖలోని 1300 మంది ఉద్యోగులను తొలగించటం కోసం అనుమతి ఇవ్వాలంటూ సుప్రీం కోర్టుకు శుక్రవారం విజ్ఞప్తి చేయటం కొత్త ఆందోళనలకు కారణంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ విద్యా శాఖను రద్దు చేయాలనే ప్రణాళికలను సవాలు చేస్తూ 20 రాష్ట్రాలు, పాఠశాల జిల్లాలు, టీచర్స్ యూనియన్ దాఖలు చేసిన రెండు వివాదాలలో న్యాయ శాఖ హైకోర్టు జోక్యాన్ని కోరుతోంది.
విద్యాశాఖను తొలగిస్తామని ట్రంప్ ఇచ్చిన హామీలో భాగంగా.. ట్రంప్ పరిపాలన ఇప్పటికే అనేక గ్రాంట్లను రద్దు చేసి, ఉద్యోగుల తగ్గింపు లేదా తొలగింపును అమలు చేస్తోంది. ఈ పరిణామాలు 1,378 మంది ఉద్యోగులపై ప్రభావం చూపింది. – దీంతో శాఖలోని ప్రభావిత కార్మికులను అడ్మినిస్ట్రేటివ్ సెలవుపై ఉంచారు. జూన్ 9 వరకు పూర్తి జీతం, ప్రయోజనాలను పొందనున్నారు. విద్యా శాఖలోని విద్యార్థి-రుణ పోర్ట్‌ఫోలియోను స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ స్వాధీనం చేసుకోనుంది. ప్రత్యేక విద్య, పోషకాహారం, ఇతర సంబంధిత సేవలను హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ విభాగం నిర్వహిస్తుందని ట్రంప్ ప్రకటించారు.
ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఫెడరల్ జడ్జి తీర్పు వెలువరిస్తూ లేఆఫ్స్ చేయకుండా అడ్డుకుంటూ ఆర్డర్ పాస్ చేశారు. దీనిని చట్టవిరుద్ధంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగే 1400 మంది ఉద్యోగులను తిరిగి వారి స్థానాల్లోకి తీసుకోవాలని డిస్ట్రిక్ట్ జడ్జి మయాంగ్ జౌన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఏకపక్షంగా విద్యా శాఖను క్లోజ్ చేయటానికి చేస్తున్న ప్రయత్నాలను కోర్టు తప్పుపట్టింది. దీంతో కింది కోర్టులో ఎదురుదెబ్బ తగలటంతో ప్రస్తుతం ట్రంప్ సుప్రీం కోర్టు తలుపు తట్టారు.