. < 1 minute

French Open Grand Slam tournament

స్వియాటెక్ ఇంటికి, జకోవిచ్ ముందుకు

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ అరిన సబలెంక (బెలారస్), రెండో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) ఫైనల్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీ ఫైనల్లో సబలెంక 76, 46, 60తో డిఫెండింగ్ ఛాంపియన్, ఐదో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్)ను ఓడించింది. తొ లి రెండు సెట్లలో పోరాటం ఆసక్తిగా సాగింది. ఆరంభ సెట్‌లో ఇటు సబలెంక అటు స్వియాటెక్ సర్వం ఒడ్డి పోరాడారు. ప్రతి పాయింట్ కోసం ఇద్దరు తీవ్రంగా శ్రమించారు. దీంతో పోరులో ఉత్కంఠ తప్పలేదు. సబలెంక, ఇగా తమ మార్క్ షాట్లతో ముందుకు సాగారు. ఎవరి సర్వీస్‌ను వారు కాపాడుకుంటూ ముందుకు సాగారు.

వీరి ఆట అభిమానులను కనువిందు చేసింది. ఆసక్తికరంగా సాగిన సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఇందులో చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన సబలెంక సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో కూడా హోరాహోరీ పోరు సాగింది. ఈసారి కూడా ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. కానీ ఈసారి స్వియాటెక్ పైచేయి సాధించింది. తన మార్క్ ఆటతో అలరించిన ఇగా ప్రత్యర్థి సబలెంక జోరుకు బ్రేక్ వేసింది. ఇదే క్రమంలో సెట్‌ను గెలిచి స్కోరును 11తో సమం చేసింది. కానీ ఫలితాన్ని తేల్చే మూడో, చివరి సెట్‌లో సబలెంక ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది. దూకుడైన ఆటతో ఇగాను హడలెత్తించింది. శివమెత్తినట్టు ఆడిన సబలెంక ప్రత్యర్థిక ఒక్క గేమ్ కూడా గెలిచే అవకాశం ఇవ్వలేదు. అలవోకగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరో సెమీ ఫైనల్లో గాఫ్ విజయం సాధించింది. ఫ్రాన్స్ క్రీడాకారిణి లూయిస్ బైసన్‌తో జరిగిన పోరులో గాఫ్ 61, 62తో జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన గాఫ్ అలవోక విజయాన్ని అందుకుంది.

సెమీస్‌లో జకోవిచ్..

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో జకోవిచ్ 46, 63, 62, 64తో మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ)ని ఓడించాడు. తొలి సెట్‌లో జ్వరేవ్ అధిపత్యం చెలాయించాడు. అలవోకగా సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ తర్వాత పుంజుకుని ఆడిన జకోవిచ్ వరుసగా మూడు సెట్లను గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. సెమీస్‌లో టాప్ సీడ్ జన్నిక్ సినర్ (ఇటలీ)తో జకోవిచ్ తలపడుతాడు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.