. 2 minutes

ట్రంప్-మస్క్ మధ్య చెడిన స్నేహం.. ఒక్క రాత్రిలో టెస్లా విలువ రూ.12 లక్షల కోట్లు ఢమాల్..

Caption of Image.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపుకి ప్రపంచ కుబేరుడు, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా ఎంత సాయం చేశారో అందరికీ తెలిసిందే. గెలుపు తర్వాత ట్రంప్ కి అత్యంత సన్నిహితుడిగా మారిన మస్క్ డోజీ ద్వారా ఖర్చులు తగ్గించేందుకు కీలకంగా వ్యవహరించారు. కానీ ప్రస్తుతం ట్రంప్ తీసుకొస్తున్న బిగ్ బ్యూటిఫుల్ టాక్స్ బిల్ వీరి స్నేహాన్ని బీటలువార్చింది. 

పన్ను తగ్గింపు బిల్లును ట్రంప్ వెనకేసుకొస్తుంటే ఎలాన్ మస్క్ దానిపై బాహాటంగానే వ్యతిరేకిస్తున్నట్లు కామెంట్స్ చేశారు. అయితే ఎలాన్ మస్క్ తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తనకు ఎదురుతిరటంపై స్పందించిన ట్రంప్ నేను అస్సలు పట్టించుకోనంటూ బదులిచ్చారు. తాను తెస్తున్న బిల్లు ద్వారా ఖర్చులను 1.6 ట్రిలియన్ డాలర్లు తగ్గుతాయని, పన్ను తగ్గింపులు లభిస్తాయన్నారు. అయితే బిల్ పాస్ కాకుండా నిలిపితే ప్రస్తుతం ఉన్న దానికంటే 68 శాతం అధిక పన్నులు విధిస్తానని బెదిరించారు.

మరోపక్క ఎలాన్ మస్క్ తన ఎక్స్ పోస్టులో తాను లేకపోతే ట్రంప్ ఖచ్చితంగా ఎన్నికల్లో ఓడిపోయేవారంటూ చేసిన పోస్ట్ పెద్ద దుమారం రేపుతోంది. అయితే మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు తనను నిరాశకు గురిచేశాయని ట్రంప్ పేర్కొన్నారు. తామిద్దరికీ మంచి స్నేహబంధం ఉందని, అయితే ఇకపై అది కొనసాగుతుందని తాను అనుకోవటం లేదని ట్రంప్ ఓవల్ ఆఫీసులో రిపోర్టర్లతో మాట్లాడుతూ అన్నారు. అసలు బిల్లు నిర్మాణంలో ఏం జరుగుతందనే విషయం అందరికంటే ఎక్కువ ఎలాన్ మస్క్ కి తెలుసని అయితే ఇప్పుడెందుకు ఇలా మారిపోయాడో అర్థం కావటం లేదని ట్రంప్ చెప్పారు. కానీ మస్క్ తనకు అలాంటి విషయాలేమీ తెలియవంటూ క్లారిటీ ఇచ్చారు. 

వాస్తవానికి ట్రంప్ తెస్తున్న కొత్త బిల్లులో ఎలాన్ మస్క్ సీఈవోగా ఉన్న టెస్లాకు భారీ నష్టం వాటిల్లనుందని తెలుస్తోంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలకు అందిస్తున్న సబ్సిడీల తగ్గింపులు టెస్లాకు భారీ నష్టాన్ని కలిగించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్ నిర్ణయాలు సంవత్సరం రెండవ అర్థభాగంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యానికి దారితీస్తుందని మస్క్ ఎక్స్ ఖాతాలో అన్నారు. 

మెుత్తానికి ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంతో అమెరికా స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో టెస్లా స్టాక్ ఏకంగా 14 శాతం క్షీణతను చూడటంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.12 లక్షల కోట్లు ఒక్కరాత్రిలో తుడిచిపెట్టుకుపోయింది. 

ఇక్కడితో అగని మస్క్ అమెరికాలో అత్యంత గోప్యంగా ఉంచబడిన ఎప్‌స్టిన్ ఫైళ్లలో ట్రంప్ పేరు ఉందంటూ మస్క్ పెద్ద బాంబు పేల్చారు. నిజాలు భవిష్యత్లులో బయటకు వస్తాయంటూ చేసిన ట్వీట్ అమెరికాలో షాక్ వేవ్స్ పుట్టించింది. ట్రంప్ అందుకే ఈ పత్రాలను బహిర్గతం కాకుండా అడ్డుకుంటున్నారంటూ మస్క్ ఆరోపించారు. ట్రంప్ గతంలో ఎప్స్టీన్‌తో తనకు గతంలో పరిచయం ఉందని అంగీకరించినప్పటికీ, తన నేర కార్యకలాపాలలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని పదే పదే ఖండించిన సంగతి తెలిసిందే. 

అసలు ఈ ఎప్స్టీన్‌ ఎవరు..
ఎప్స్టీన్‌ అమెరికాలో ఒక వివాదాస్పద వ్యాపారవేత్త. ఆయన బ్రిటన్, అమెరికాలో సంపన్నులు, పేరున్న బడాబాబులకు యువతులను సరఫరా చేసేవాడు. మైనర్లను ఎక్కువగా వ్యభిచారంలోకి లాగేవాడు. ఇవన్నీ పచ్చినిజాలను దర్యాప్తుల్లో కూడా తేలింది. దాదాపు 36 మంది అమ్మాయల జీవితాలను ఇతడు నాశనం చేసినట్లు అధికారులు 2005లో జరిగిన దర్యాప్తులో గుర్తించారు. 2008లో జైలు శిక్ష పడిన బిజినెస్ మెన్ 2019లో జైలులోనే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అయితే ఇలాంటి వ్యక్తితో ట్రంప్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మస్క్ ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన పత్రాలను కోర్టు సీల్ చేసింది. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.