. < 1 minute
కూతురు పెళ్లి మండపానికి చేరుకునే లోపే ఆగిన తండ్రి గుండె..!

తిరుపతి జిల్లాలో పెళ్లి ఇంట విషాదం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తిలోని కేవీబీ పురం మండలం కోవనూరుకు చెందిన సాంబయ్య ఇంట్లో జరగాల్సిన పెండ్లి విషాదంగా ముగిసింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న సాంబయ్యకు భార్య ఇద్దరు ఆడ బిడ్డలుండగా పెద్ద కూతురుకు మూగ, వినికిడి సమస్యతో బాధపడుతోంది.

మాట, వినికిడి లోపం ఉన్న కూతుర్ని అల్లారుముద్దుగా చూసుకున్న సాంబయ్య దంపతులు పెళ్లి చేసి సంబరం చూడాలనుకున్నారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ కు చెందిన సమీప బంధువుల ఇంటికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. దగ్గరి బంధుత్వమున్న కుటుంబంలోని యువకుడికి కూతురిని ఇచ్చి ఘనంగా పెళ్లి ముచ్చట జరిపించాలని భావించారు. ఇందులో భాగంగానే కొన్ని రోజులు పాటు సెలవు పెట్టి పెళ్లి పనులు చూసుకుంటున్న సాంబయ్య శ్రీకాళహస్తి సమీపంలోని అంజూరు కళ్యాణ మండపంలో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు.

అన్ని పనులు దగ్గరుండి కానీ చూసుకున్న సాంబయ్య గురువారం(జూన్ 05) సాయంత్రం శ్రీకాళహస్తి నుంచి పెండ్లికి కావాల్సిన వస్తువులు, సామాన్లు కళ్యాణ మండపానికి చేర్చే ప్రయత్నం చేశాడు. పెళ్లి మండపం వద్ద బంధువుల హడావుడి కొనసాగుతుండగా, పెళ్లి సామాగ్రిని శ్రీకాళహస్తి నుంచి ఆటోలో పంపి వెనుక బైక్ లో బయలుదేరాడు. సాంబయ్య కొద్ది దూరం వెళ్లక ఉన్నపళంగా బైక్ నుంచి కింద వాలిపోయాడు. అక్కడే కుప్పకూలి పడిపోయాడు.

బైక్ పై మండపానికి వెళుతూ గుండె పోటుకు గురైన సాంబయ్య గుర్తించిన స్థానికులు హుటాహుటిన శ్రీకాళహస్తిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సాంబయ్యను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సాంబయ్య కూతురు పెళ్లి మండపానికి చేరుకునే లేపే విషాద ఘటన జరిగి పోయింది. దీంతో రాత్రి జరగాల్సిన కూతురు రిసెప్షన్ ఆగిపోగా కళ్యాణ మండపం మూగబోయింది.
తండ్రి సాంబయ్య మృతితో అర్ధాంతరంగా కూతురు పెళ్లి ఆగిపోయింది.

సాంబయ్య సొంతూరు కోవనూరులోని పెళ్లి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సాంబయ్య డెడ్ బాడీని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొన్ని గంటల్లో పెళ్లి పీటలపై కూర్చోనున్న కూతురి పెళ్లి వేడుక చూడకుండానే తండ్రి సాంబయ్య కన్నుమూయడంతో పెళ్లిలో పాల్గొనేందుకు వచ్చిన బంధువులు స్నేహితులు గుండెలు బాదుకుంటూ విలపించడం అందరినీ కలిచివేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.